కలం, తెలంగాణ బ్యూరో : ఇద్దరు మీడియా యజమానుల మధ్య పంచాయతీలోకి మంత్రుల్ని, ప్రజా ప్రతినిధులను లాగొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. ఆంబోతుల కొట్లాటలో లేగదూడల కాళ్ళు విరిగినట్లు రెండు మీడియా సంస్థల మధ్య ఆధిపత్య పోరులో మంత్రుల్ని బద్నాం చేయడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లలో (Singareni Tenders) అవకతవకలు జరిగినట్లు, అవినీతి చోటుచేసుకున్నట్లు పత్రికల్లో, ఛానెళ్ళలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతికి, అవకతవకలకు ఆస్కారం లేదని, అలాంటివాటిపై రాజీపడే ప్రసక్తే లేదని నొక్కిచెప్పారు. మంత్రులపై కథనాలను రాసే ముందు మంత్రివర్గ పెద్దగా తన వివరణ తీసుకోవాలని సూచించారు. అందరి సలహా తీసుకుని ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని, ఆధారాలే లేకుండా కథనాలు రాయడం మంచి పద్ధతి కాదన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా మద్దులపల్లిలో జరిగిన బహిరంగ సభలో సీఎం పై వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం పట్ల అపోహలు వద్దు :
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులపై వచ్చే ఆరోపణలతో వారి కుటుంబ పెద్దగా, ప్రభుత్వ నాయకుడిగా అవి తన గౌరవానికి భంగం కలిగించేవని ముఖ్యమంత్రి అన్నారు. అలాంటి ఆరోపణలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రసారం చేయడం ద్వారా తన నాయకత్వం పట్లనే ప్రజలకు అపోహలు కలగడానికి దారితీస్తుందన్నారు. “సింగరేణి టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి.. పత్రికలు, టీవీలకు, సోషల్ మీడియాకు చెప్పదల్చుకున్నాను… ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసర ప్రచారం, తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలకు కొత్త అపోహలు కల్పిస్తున్నారు. మీడియా సంస్థల మధ్య, యాజమాన్యాల మధ్య పంచాయతీ ఉంటే ఒకరి మీద మరొకరు బురద జల్లుకోండి.. కానీ ఆ పంచాయతీలోకి మంత్రుల్ని, ప్రజా ప్రతినిధుల్ని, మమ్మల్ని లాగొద్దు…” అని అన్నారు.

Read Also: ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నా మారని కాంగ్రెస్ : ప్రధాని మోదీ
Follow Us On: Pinterest


