కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను ప్రయారిటీ సెక్టార్లుగా పెట్టుకున్నదని, అందుకే ఆ రెండింటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. విద్యతో సంస్కారం మాత్రమే కాక భవిష్యత్తులో నిలదొక్కుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇక వైద్య రంగంలో దేవుడిపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకుంటారో డాక్టర్లపైనా, వైద్య సిబ్బందిపైనా అంతే విశ్వాసంతో ఉంటారని అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఏదులాపురంలో (Edulapuram) 100 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, నర్సింగ్ విద్యార్థినులకు కోర్సుతో పాటు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలను కూడా నేర్పిస్తామన్నారు. ఈ దేశాల్లో భారత నర్సింగ్ విద్యార్థులకు చాలా ఉపాధి అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈ భాషలను ఈ నర్సింగ్ కళాశాలలో నేర్పిస్తామన్నారు.
ముఖ్యమంత్రిగా తాను జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించినప్పుడు భారతదేశ నర్సులకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థమైందన్నారు. మన నర్సుల సేవలను ఆ దేశ అధికారులు, ప్రజలు కొనియాడారని గుర్తుచేశారు. ఇప్పటికీ మన దేశ నర్సులకు ఆ దేశాల్లో మంచి డిమాండ్ ఉన్నదని, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆ దేశ భాషలను నేర్చుకుంటే నర్సులకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. ఏదులాపురం నర్సింగ్ కళాశాల నుంచే విదేశీ భాషలను నేర్పించే విధానాన్ని మొదలుపెడతామన్నారు. నర్సులు అందించే సేవల ద్వారా తెలంగాణకు మాత్రమే కాక దక్షిణ భారతదేశ ప్రతిష్ట పెరుగుతుందన్నారు.

Read Also: సీఎం పర్యటనలతో పాలమూరుకు ఒరిగిందేమీ లేదు : లక్ష్మారెడ్డి
Follow Us On : WhatsApp


