బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Polls) సమీపిస్తున్న వేళ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకున్నది. ప్రచారం ఊపందుకున్నది. ఎన్డీయే, మహాగట్ బంధన్ కూటములు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శనివారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రజలకు వీడియో సందేశం పంపించారు. మరో ఐదు రోజుల్లో తొలి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ విడుదల చేసిన వీడియో ప్రాముఖ్యం సంతరించుకున్నది. “ఇన్నేళ్లు మీ కోసమే పని చేశాను, బీహార్ మార్పు మీ కండ్ల ముందే ఉంది. అభివృద్ధి ఆగకూడదు. నిజాయితీగా పనిచేసిన నాకు మరో సారి అవకాశం ఇవ్వండి. కేవలం డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి
తమ పాలనలో బిహార్ శాంతిభద్రతలు మెరుగుపడటమే కాకుండా విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని వివరించారు. “గతంలో చీకట్లో మగ్గిన రాష్ట్రం ఇప్పుడు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతోంది. ఒక్కో గ్రామానికి రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాం. ఇది మన అందరి సంయుక్త విజయం” అని నితీశ్ కుమార్(Nitish Kumar) అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. “వాళ్ల పాలనలో భయం రాజ్యమేలింది. మహిళలు బయటకు రావడమే కష్టంగా ఉండేది. కానీ మన ప్రభుత్వం మహిళలకు గౌరవం, స్వతంత్రత ఇచ్చింది” అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిహార్ అభివృద్ధికి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. “కేంద్రం, రాష్ట్రం రెండింటిలోనూ ఎన్డీయే కూటమి ఉండటం వల్లే బీహార్ వేగంగా ముందుకెళ్తోంది. ఈ అభివృద్ధి ఆగిపోకూడదు. అభివృద్ధి కొనసాగాలంటే మా కూటమికి ఓటు వేయండి.’ అని నితీశ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఇటు ఎన్డీయే, అటు మహా గట్ బంధన్ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మరి ప్రజలు ఎవరివైపు నిలుస్తారో వేచి చూడాలి.
Read Also: ఏపీలోని కాశీబుగ్గలో తీవ్రవిషాదం.. తొమ్మిది మంది దుర్మరణం
Follow Us On : Instagram

