కలం డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) మరోసారి రిసార్ట్ రాజకీయాలకు (Resort Politics) తెరలేపారు. ఈసారి ఆయన బీజేపీ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) లో కింగ్ మేకర్ గా అవతరించిన షిండే.. తన పార్టీ కౌన్సిలర్లను ఫైవ్ స్టార్ హోటల్ కు తరలించడం మొదలు పెట్టారు. బీఎంసీ మేయర్ విషయంలో బీజేపీతో విభేదాలే ఇందుకు కారణమన్న కథనాలు వస్తున్నాయి. బీఎంసీ లో మొత్తం 227 స్థానాలకు గాను.. బీజేపీ, శివసేన (షిండే) పార్టీల మహాయుతి కూటమి 118 సీట్లను కైవసం చేసుకుంది. మేజిక్ ఫిగర్ 114. బీజేపీకి 89, షిండే శివసేనకు 29 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల్లో ఉద్దవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన (యూబీటీ)కి 65, ఎంఎన్ ఎస్ 6, ఎన్సీపీ (ఎస్పీ) ఒక్క స్థానాలను దక్కించుకున్నాయి. ఈ మూడు పార్టీల కూటమి బలం 72. ఇక.. కాంగ్రెస్ 24, ఎంఐఎం 8, ఎస్పీ 2 సీట్లను సాధించాయి. మరో మూడు సీట్లను ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు.
కింగ్ మేకర్ గా మారి..!
బీఎంసీ ఎన్నికల్లో (BMC Elections) ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాలేదు. కూటమిగా అయితే.. బీజేపీ, షిండే శివసేన ఆధ్వర్యంలోని మహాయుతికి మెజార్టీ వచ్చినప్పటికీ, తన పార్టీకే మేయర్ పీఠం కావాలని ఏక్ నాథ్ షిండే వర్గం పట్టుబడ్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 25 ఏండ్ల తర్వాత బృహన్ ముంబై కార్పొరేషన్ పీఠం థాక్రేల చేతుల నుంచి చేజారడంతో అక్కడ తమ పట్టునిలుపుకోవాలని షిండే సేన భావిస్తున్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా తాము అవతరించినందున తమకే పీఠం ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా బీఎంసీ మేయర్ పీఠాన్ని థాక్రేల శివసేన దక్కించుకుంటున్నదని.. ఇప్పుడు తమ ఆధ్వర్యంలోని శివసేనకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడ్తున్నది. ఇదే క్రమంలో తన పార్టీ కౌన్సిలర్లందరికీ ఫైవ్ స్టార్ హోటల్ లో షిండే బస ఏర్పాటు చేశారు. బీజేపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వెయిట్ చేయాలని వారికి ఆయన సూచించినట్లు తెలిసింది.
ప్రతిపక్షాలకు చాన్స్ !
ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టడంతో ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. షిండేను విమర్శిస్తూనే బీఎంసీలో పాలకవర్గ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. షిండే శివసేన, బీజేపీలోని కౌన్సిలర్లలో ఓ ఐదారుగురు తమకు మద్దతిస్తే పగ్గాలు చేపట్టవచ్చని భావిస్తున్నది. ప్రతిపక్షాలు, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు అంతా ఒక్కటైతే 109 స్థానాల బలం చేకూరుతుంది. మేజిక్ ఫిగర్.. 114. అంటే మరో ఐదుగురు కౌన్సిలర్ల మద్దతు లభిస్తే చాలు ప్రతిపక్షాలు సైతం బీఎంసీలో చక్రం తిప్పేందుకు చాన్స్ ఉంటుంది. కాగా.. మేయర్ పీఠాన్ని తాము మళ్లీ గెలుచుకోవాలని ప్రయత్నించామని, కానీ అది దక్కలేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. షిండేకు రిసార్ట్ పాలిటిక్స్ కొత్తేమీ కాదని ఆయన విమర్శించారు.
Read Also: అడవిలో క్యాబినెట్ భేటీ.. పోలీసుల కూంబింగ్
Follow Us On: Instagram


