కలం, వెబ్ డెస్క్ : జర్నలిస్టుల అరెస్టును (Journalists Arrest) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్రంగా ఖండించారు. ఈ చర్య పత్రికా స్వేచ్ఛపై జరిగిన ప్రత్యక్ష దాడి అని, ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
పండుగ వేళ అర్ధరాత్రి సమయంలో జర్నలిస్టుల ఇళ్ల తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించడం, చట్టపరమైన నిబంధనలు పాటించకుండా వారిని అరెస్టు చేయడం అత్యంత దారుణమని వైఎస్ జగన్ (YS Jagan) పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. జర్నలిస్టులు నేరస్థులు కాదని, వారిని తీవ్రవాదుల్లా చూస్తూ కఠినంగా ప్రవర్తించడం సమంజసం కాదని స్పష్టం చేశారు.
పోలీసుల ఈ అనాగరిక చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరెస్టులు మీడియా వర్గాల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని తెలిపారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ చట్టబద్ధమైన పాలన సాగించాలని ఆయన కోరారు.
Read Also: భూమి తవ్వుతుండగా భారీ పేలుడు.. ముగ్గురు మృతి
Follow Us On: Instagram


