కలం, వెబ్ డెస్క్: ఇటీవల ఐఏఎస్ (IAS) అధికారిణిపై వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరం రాష్ట్రంలో అనేక వివాదాలకు దారితీసింది. ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ ఫొటో కూడా జత చేయడం కూడా చర్చనీయాంశమైంది. అధికారిణిపై వచ్చిన వార్తలను ఖండిస్తూ అసొసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పలు మీడియా ఛానళ్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్టీవీ (తెలుగు న్యూస్ ఛానెల్), తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9 తెలంగాణ (టీవీ ఛానెల్), పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ, ఓల్గా టైమ్స్, మిర్రర్ టీవై అఫిషియల్, టీ-న్యూస్ తెలుగు లాంటివి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటుచేశారు.
ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అసత్య ప్రచారాలు చేసిన జర్నలిస్టులను (Journalists) గుర్తించి మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు పది మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పుడు వార్తల్లో ఎవరి పాత్ర ఎంత ఉంది? ఎందుకు చేశారు? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. బుధవారం సాయంత్రం వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి. ఈ ఘటనపై మీడియా సంఘాలు ఏవిధంగా స్పందిస్తాయి? అనేది కూడా చర్చనీయాంశమవుతోంది.


