కలం వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి వలసదారులపై కఠిన వ్యాఖ్యలు చేశారు. మోసం(Fraud) కేసుల్లో దోషులుగా తేలిన నేచురలైజ్డ్ వలసదారుల(Naturalized Migrants) పౌరసత్వాన్ని(citizenship) రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. సోమాలియా(Somalia) నుంచి వచ్చిన వారితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేశారు. డెట్రాయిట్ ఎకనామిక్ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. తమ పౌరులను మోసం చేసినట్లు రుజువైతే సోమాలియా నుంచి వచ్చినవారైనా, మరే దేశం నుంచి వచ్చినవారైనా సరే.. వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ట్రంప్ సోమాలీ వలసదారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మిన్నెసోటా, మేన్ రాష్ట్రాల్లోని సోమాలీ కమ్యూనిటీలను ప్రస్తావించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. చిన్న వయసులోనే సోమాలియా నుంచి శరణార్థిగా అమెరికాకు వచ్చిన ఇల్హాన్ ఒమర్, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. మరోవైపు సోమాలీ వలసదారులకు ఇచ్చిన టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS)ను ముగిస్తున్నట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా ధ్రువీకరించింది. ఇతర దేశాల్లో పుట్టి, తర్వాత చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా అమెరికా పౌరసత్వం పొందిన వ్యక్తులను నేచులైజ్డ్ వలసదారులు అంటారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో నివసిస్తున్న వేలాది సోమాలీ వలసదారుల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రకటనతో అమెరికాలో వలసదారుల విధానాలపై మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది.


