కలం, వెబ్ డెస్క్: క్యాన్సర్ అతి భయంకరమైన మహమ్మారి. ఈ వ్యాధి బారిన పడి ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తేనే చికిత్స అందించడం సాధ్యమవుతోంది. ఇక రక్తానికి సంబంధించిన క్యాన్సర్లలో అయితే వ్యాధి చికిత్స చాలా కష్టమవుతోంది. అటువంటి అరుదైన క్యాన్సర్లలో మైలో ఫైబ్రోసిస్ (Myelofibrosis) ఒకటి. ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. ఈ క్యాన్సర్‌కు తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు చికిత్సను కనిపెట్టారు. ప్రస్తుతం ఈ వ్యాధికి కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ.. అవి కేవలం ఉపశమనం మాత్రమే.. పూర్తిగా నయం చేసే చికిత్స ఇప్పటివరకు అందుబాటులో లేదు.
ఏమిటీ మైలోఫైబ్రోసిస్
మైలోఫైబ్రోసిస్ (Myelofibrosis) అనేది అత్యంత అరుదుగా కనిపించే రక్త క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాధి. ఇది ప్రధానంగా ఎముకల మజ్జ (బోన్ మారో)ను ప్రభావితం చేస్తుంది. ఎముకల మజ్జలోనే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు తయారవుతాయి. కానీ మైలోఫైబ్రోసిస్‌లో మజ్జలో క్రమంగా ఫైబ్రోసిస్ (గట్టి కణజాలం) ఏర్పడి, సాధారణ రక్త కణాల ఉత్పత్తి అడ్డంకి పడుతుంది. దీంతో శరీరానికి అవసరమైన రక్త కణాలు సరైన మోతాదులో తయారుకాక, రోగుల్లో పలు సమస్యలు తలెత్తుతాయి.
లక్షణాలు ఏమిటి?
తీవ్రమైన అలసట
రక్తహీనత (అనీమియా)
ఎముకలు, కడుపు ప్రాంతంలో నొప్పులు
ప్లీహం (స్ప్లీన్) అసాధారణంగా పెరగడం
బరువు తగ్గడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎముకల మజ్జ సరిగా పనిచేయకపోవడంతో, రక్త కణాల తయారీ బాధ్యతను శరీరం ప్లీహం, కాలేయం వంటి అవయవాలపై పడుతుంది. మైలోఫైబ్రోసిస్‌కు ఇప్పటివరకు పూర్తి చికిత్స అందుబాటులో లేదు. ప్రస్తుతం ఉన్న చికిత్సలు ప్రధానంగా లక్షణాలను తగ్గించడం, రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడంపైనే దృష్టి సారిస్తున్నాయి.
ఆస్ట్రేలియా వైద్యుల ఘనత
తాజగా ‘బ్లడ్’ (Blood) జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. కొత్త చికిత్స కేవలం లక్షణాల నియంత్రణకే పరిమితం కాలేదు. వ్యాధిని ప్రేరేపించే అసాధారణ రక్త కణాలనే లక్ష్యంగా చేసుకునే కొత్త ఇమ్యూనోథెరపీ విధానం. దృష్టి సారించింది. సౌత్ ఆస్ట్రేలియన్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SAHMRI) బ్లడ్ క్యాన్సర్ కార్యక్రమ డైరెక్టర్ ప్రొఫెసర్ డేనియల్ థామస్ మాట్లాడుతూ, “మైలోఫైబ్రోసిస్ బాధితులకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్సలు లక్షణాలను మాత్రమే నియంత్రిస్తున్నాయి. కానీ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి కల్పించడం లేదు. దీంతో తాజాగా ఆస్ట్రేలియా అధ్యయన బృందం వ్యాధికి కారణమయ్యే కణాలను సమర్థవంతంగా తొలగించేందుకు అనువైన రెండు కీలక లక్ష్యాలను గుర్తించింది. ఈ అధ్యయనం ‘ప్రెసిషన్ ఇమ్యూనాలజీ’ సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అంటే, ఆరోగ్యకరమైన కణాలకు ఎక్కువ నష్టం కలగకుండా, వ్యాధి కణాలను మాత్రమే గుర్తించి రోగనిరోధక వ్యవస్థ ద్వారా నిర్మూలించే విధానం ఇది. ఈ కొత్త విధానం భవిష్యత్తులో మైలోఫైబ్రోసిస్ వ్యాధిని సమర్థవంతంగా అడ్డుకుంటుందని వైద్యులు చెబుతున్నారు.
Read Also: శ్రీరాముడు బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడా?: పీసీసీ చీఫ్ కామెంట్స్
Follow Us On: X(Twitter)


