epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ధరణి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్ : మంత్రి పొంగులేటి

కలం, వెబ్​ డెస్క్​ : ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అన్ని లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఆడిటింగ్ నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో రెవెన్యూ అధికారులతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలోని జ‌న‌గాం త‌దిత‌ర ప్రాంతాల్లో బయటపడిన స్టాంప్ డ్యూటీ సొమ్ము చెల్లింపుల్లో అక్ర‌మాలపై అధికారుల‌తో స‌మీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాల లావాదేవీలపై ఆడిట్ నిర్వహించ‌గా మొత్తం 52 లక్షల లావాదేవీలలో 4,800 లోపాలు గుర్తించామ‌ని తెలిపారు. వీటిలో దాదాపు 3000 లోపాలు రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఉన్నాయ‌న్నారు. వీటికి సంబంధించిన‌ మొత్తాన్ని తప్పకుండా రికవరీ చేస్తామ‌ని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్ లో భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ సొమ్మును పక్కదారి పట్టిన విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమాలకు పాల్పడిన ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌లో ఆడిటింగ్ విధానం లేకపోవడమే ఇలాంటి అక్రమాలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు ఈ ఘటనపై పూర్తిస్థాయి, లోతైన విచారణ జరిపించి బాధ్యులెవరో తేల్చి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.

ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా లేదా అన్న అంశంపై కూడా లోతైన విచారణ జరపాలని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రభుత్వానికి రావాల్సిన ఒక్క పైసా సొమ్ము దుర్వినియోగం చేసినా సహించేది లేదన్నారు. ప్రజల సొమ్ముతో ఆడుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని, ఇలాంటి అక్రమాలకు ఇకపై తావు ఉండదని Minister Ponguleti స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>