కలం, వెబ్‌డెస్క్: మీ ఇన్స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని మెయిల్ వచ్చిందా? అయితే, మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే 1.75కోట్ల ఇన్‌స్టా అకౌంట్ల డేటా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ మాల్వేర్బైట్స్ చెబుతోంది. ఇన్‌స్టా పాస్ట్‌వర్డ్ మార్చకోమంటూ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో యూజర్ల మెయిల్‌కు మెసేజ్‌లు రావడం దీన్ని బలపరుస్తోంది. మాల్వేర్బైట్స్ ఏం చెప్పిందంటే.. శుక్రవారం డార్క్ వెబ్‌లో కొందరు సైబర్ నేరగాళ్లు తమ వద్ద 1.75కోట్ల మంది ఇన్‌స్టా వివరాలు అమ్మకానికి పెట్టారు. ఇందులో యూజర్ నేమ్‌లు, అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు, మెయిల్స్ ఉన్నాయి. ఈ సమాచారాన్ని వాళ్లు అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రమాదం ఉందని గుర్తించిన మాల్వేర్బైట్స్ వెంటనే విషయాన్ని బయటపెట్టింది.
‘ఇన్‌స్టా నుంచి భారీగా డేటా లీక్ అయ్యింది. సోలోనిక్ అనే మారు పేరుతో పనిచేస్తున్న ఒక సైబర్ నేరగాడు.. ఈ డేటాను హ్యాకింగ్ ఫోరమ్‌లో అమ్మకానికి ఉంచాడు. అందరూ ముందు జాగ్రత్తగా తమ పాస్వర్డ్స్ మార్చుకోండి’ అంటూ మాల్వేర్బైట్స్ పేర్కొంది. వెంటనే దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. కొందరు యూజర్లు తమకు ఇన్‌స్టా అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోమని మెయిల్ వచ్చినట్లు చెప్పడంతో కలకలం రేగింది.
ఇన్‌స్టా ఏమందంటే..
డేటా అపహరణ ఆరోపణలను ఇన్స్టాగ్రామ్ (Instagram ) కొట్టివేసింది. తమ యూజర్ల అకౌంట్ల వివరాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల పాస్వర్డ్ మార్చుకోమంటూ మెయిల్ వచ్చిందని వివరించింది. అలాంటి ఈమెయిల్స్‌ను పట్టించుకోవద్దంటూ సూచించింది. కాగా, ఆరోపణలు ఎలా ఉన్నా.. యూజర్లు తమ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవడం ఉత్తమం. దీనికోసం బలమైన పాస్వర్డ్ పెట్టుకోవాలి. టూ-ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోవాలి. అనుమానాస్పద మెయిల్స్, మెసేజ్‌లపై క్లిక్ చేయవద్దు. లాగిన్ వివరాలు అడిగే వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
Read Also: సత్తుపల్లిలో భారీ సైబర్ దోపిడీ.. 18 మంది నిందితుల అరెస్ట్
Follow Us On: Sharechat


