కలం వెబ్ డెస్క్: మహిళా ఐఏఎస్ (Woman IAS) అధికారులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అసభ్యకర, అనుచిత ప్రచారాలపై తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న అధికారుల గౌరవాన్ని దెబ్బతీయడం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు.
మహిళలు ఉన్నత స్థానాలకు ఎదగడాన్ని సహించలేని ఫ్యూడల్ మానసికత ఉన్నవారే ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని, ఈ క్రమంలో వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని మంత్రి సీతక్క తేల్చి చెప్పారు.
విధి నిర్వహణలో మహిళా ఐఏఎస్ అధికారులు చూపుతున్న ధైర్యం, నిబద్ధతను అభినందించిన సీతక్క, ప్రభుత్వం వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా లేదా ఇతర వేదికల ద్వారా దూషణలకు దిగే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మహిళలపై జరుగుతున్న ఈ ద్వేషపూరిత ప్రచారానికి వ్యతిరేకంగా సమాజం మొత్తం ఏకం కావాలని, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి సీతక్క (Seethakka) పిలుపునిచ్చారు.
Read Also: సమాజంలో నాదీ డాక్టర్ లాంటి పాత్రే.. సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


