కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు (Singur Project) మరమ్మతులు ప్రారంభమయ్యాయి. జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ, (NDSA) జాతీయ ఆనకట్ట భద్రతా సమీక్ష ప్యానెల్ (NDSRP) సూచించిన మేరకు మరమ్మతు పనులను చేపట్టారు. మరమ్మతులు చేసేందుకు సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. మంజీరానదిపైన ఉన్న సింగూరు ప్రాజెక్టు కేంద్ర పరిధిలోని డ్యాం రిహాబిటేషన్ ఇంప్రూమెంట్ ప్రాజెక్టు అయిన డ్రిప్‌లో భాగంగా ఉంది. దీంతో డ్యాం సేఫ్టీ రివ్యూ ఫ్యానల్ అధికారులు దీనిని ఏడాదికి ఓ సారి పరిశీలిస్తూ ఉంటుంది. సింగూర్ ప్రాజెక్టు ఆనకట్టకు రక్షణగా ఉన్న పిట్టగోడకు నిలువునా చీలిక వచ్చిందని, స్పిల్‌వే, ఎర్త్ డ్యాం, గ్యాలరీలకు రిపేర్ చేయాలని చెప్పింది. కట్ట పునాదిని వెంటనే గ్రౌటింగ్ చేయడంతో పాటు సింగూరు ప్రాజెక్టు కు మరమ్మత్తులు వెంటనే చేయాలని సూచించింది.
నేషనల్ డ్యాం సేప్టీ అధారిటి సూచనల మేరకు ఆనకట్టను రిపేర్ చేయడానికి, వారి అంచనా ప్రకారం ప్రాజెక్టు మరమ్మత్తులు చేయడానికి వీలుగా రాబోయే 30 నుండి 40 రోజుల్లో ప్రాజెక్టులో నీటి నిల్వను 8 టీఎంసీలకు తగ్గించనున్నారు. సింగూరు జలశయానికి అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా కరెంటును ఉత్పత్తి చేస్తూ 2,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ప్రసుత్తం విడుదల చేస్తున్న నీటిని దిగువన ఉన్న ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాంత రైతులు వినియోగించుకుంటారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 29.91 TMCలు కాగా ప్రసుత్తం 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గత వేసవిలో ప్రాజెక్టును సందర్శించిన సమయంలో మట్టి కట్ట, ఎగువ రివెట్‌మెంట్‌కు నష్టం వాటిల్లిందని NDSRP హెచ్చరికల నేపథ్యంలో మరమ్మతులు మొదలుపెట్టారు. ఈ వర్షాకాలంలో మంజీరా నది ఎగువ నుండి పెద్దఎత్తున ఇన్ ప్లో వచ్చినప్పటికి ప్రాజెక్టు రిపేర్లను ద్రష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 16 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేశారు. ఇప్పటికే నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రూ. 16 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు ఎగువ రివెట్మెంట్ మరమ్మతు పనులను చేపట్టింది. జలాశయాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు, నిపుణుల బృందం ఆనకట్ట, ఎగువ రివెట్మెంట్ పరిస్థితిని పర్యవేక్షించి తదుపరి మరమ్మతులు చేపట్టే ముందు అవసరమైన సూచనలు చేయనుంది.

Read Also: పెరిగిన వీసా ప్రాసెసింగ్ ఫీజు.. అమెరికా కొత్త నిబంధనలివే..
Follow Us On : WhatsApp


