కలం, వెబ్ డెస్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రేపటి నుంచి తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ పర్యటన వేదిక కానుంది. పర్యటనలో భాగంగా రేపు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని, అక్కడ భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఓంకార మంత్ర పఠనంలో పాల్గొంటారు. అనంతరం ఆలయ విశిష్టతను చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రోన్ షోను ఆయన వీక్షిస్తారు.
ఎల్లుండి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొని ప్రసంగించనున్నారు. అదే రోజు ఆయన రాజ్‌కోట్‌లో పర్యటిస్తారు. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల పారిశ్రామికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని నిర్వహించే వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు అహ్మదాబాద్ నగర రవాణా రంగంలో కీలకమైన మెట్రో రైలు రెండవ దశను కూడా ఆయన ప్రారంభించనున్నారు.
జనవరి 12న జర్మన్ ఛాన్సలర్ మెర్జ్‌తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడం ఈ పర్యటనలో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అంతర్జాతీయ సంబంధాల బలోపేతంలో భాగంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన ముగింపులో భాగంగా అహ్మదాబాద్‌లో అట్టహాసంగా జరిగే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో ప్రధాని పాల్గొని ప్రజలను ఉత్సాహపరచనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.


