కలం, వెబ్ డెస్క్ : మీర్‌పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన పది నెలల కుమారుడికి విషమిచ్చి హతమార్చి, తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చూసి తట్టుకోలేక మృతురాలి తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న యశ్వంత్ రెడ్డికి, సుష్మ (27) అనే మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పది నెలల కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డి ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ఫంక్షన్ కోసం షాపింగ్ చేసేందుకు సుష్మ తన తల్లి లలిత (44) ఇంటికి వచ్చింది. అందరూ ఇంట్లోనే ఉన్న సమయంలో సుష్మ తన కుమారుడిని తీసుకుని పక్క గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుంది. అక్కడ బాబుకు విషమిచ్చి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది.
రాత్రి 9:30 గంటల సమయంలో యశ్వంత్ రెడ్డి విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్ తలుపులు లోపల నుంచి గడియ వేసి ఉన్నాయి. అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టగా.. భార్య, కుమారుడు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆయన షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కళ్లముందే కూతురు, మనవడు విగతజీవులుగా పడి ఉండటం చూసి తట్టుకోలేక సుష్మ తల్లి లలిత కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మీర్‌పేట్ (Meerpet) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


