కలం, నల్లగొండ బ్యూరో : చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని (Chervugattu Temple) అవసరమైతే పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ జే.శ్రీనివాస్, జిల్లా ఆఫీసర్లతో కలిసి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెరువుగట్టు ఆలయ ఆవరణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ ఈనెల 23 నుండి 30వ తేదీ దాకా జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువు గట్టుపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎంపీ సూచించారు. బ్రహ్మోత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, హయత్ నగర్ నుండి చెరువుగట్టు వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
ప్రతి అమావాస్యకు 50 వేల మంది భక్తుల నిద్ర : ఎమ్మెల్యే వేముల వీరేశం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట తర్వాత అతిపెద్ద దేవాలయం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయమే (Chervugattu Temple) అన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రతి అమావాస్యకు 50 వేల మంది భక్తులు ఆలయం వద్ద నిద్ర చేస్తారని తెలిపారు. చెరువుగట్టు దేవాలయానికి వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారని.. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఆ పనులకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. ప్రతి ఏడాది ఆలయానికి రూ.15 కోట్ల ఆదాయం వస్తున్నట్లు ఎమ్మెల్యే వీరేశం వెల్లడించారు. సమావేశంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, దేవాలయ ఈవో మోహన్, నార్కెట్ పల్లి తహసీల్దార్ వెంకటేశ్వర రావు, సర్పంచ్ కృష్ణ, ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.


