కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో (TVVP Employees) పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రమోషన్లకు వయో పరిమితి 56 నుంచి 59 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నం 1 విడుదల చేసింది. జాయింట్ కమిషనర్ (జనరల్), జాయింట్ కమిషనర్ (జోనల్), ప్రోగ్రాం ఆఫీసర్ల (గతంలో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ – DCHS) పోస్టులకు ఈ జీవో వర్తించనున్నది.
2000 సంవత్సరంలో జారీ చేసిన టీవీవీపీ స్పెషల్ సర్వీస్ రెగ్యులేషన్స్‌లోని అన్నెక్స్‌యూర్-IIIలో రెగ్యులేషన్ 7లోని కాలమ్ (3), (7)లోని కాలమ్ (6)లో “56 ఏళ్లు” అనే పదాల స్థానంలో “59 ఏళ్లు” అని సవరించారు. (TVVP Employees) టీవీవీపీ ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021లో జారీ చేసిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్) (అమెండ్‌మెంట్) యాక్ట్, 2021 (యాక్ట్ నం.3 ఆఫ్ 2021) ప్రకారం ఈ మార్పు అమల్లోకి వచ్చింది.
TVVP కమిషనర్ హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా, అనుభవజ్ఞులైన అధికారుల సేవలను మరింత కాలం వినియోగించుకోవడం, ప్రమోషన్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని అధికారులు చెబుతున్నారు.


