కలం, వెబ్ డెస్క్: ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాజాసాబ్’కు (The Raja Saab) తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. టికెట్ ధరల పెంపునకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలులో ఉండగానే ప్రభుత్వం కొత్తగా మెమో ఇవ్వడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రాజాసాబ్’(The Raja Saab)ను తెలంగాణలో ప్రీమియర్ షోలు, తొలి రోజులు ప్రత్యేక ధరలతో ప్రదర్శించేందుకు నిర్మాతలు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిస్తూ మెమో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లకు వేర్వేరు ధరల పెంపును ఇందులో సూచించింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో టికెట్ ధరల పెంపుపై నియంత్రణ ఉండాలని కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఆదేశాలు కొనసాగుతున్న సమయంలోనే ప్రభుత్వం మరోసారి ప్రత్యేక మెమో ఇవ్వడం చట్టబద్ధం కాదని పిటిషన్లో వాదించారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి సినిమా విడుదల సమయంలోనూ టికెట్ ధరలు పెంచేందుకు అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. ప్రజలపై ఆర్థిక భారం పడే నిర్ణయాలను యథేచ్ఛగా తీసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన మెమోను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా టికెట్ రేట్ల పెంపుకు ప్రస్తుతం అనుమతి లేని పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు సాధారణ ధరలకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ఈ పరిణామం సినిమా విడుదలపై, అడ్వాన్స్ బుకింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: తెలంగాణ వైద్య ఉద్యోగులకు గుడ్ న్యూస్
Follow Us On : Twitter


