కలం, డెస్క్: సీనియర్ జర్నలిస్టు ఫజల్ రహ్మాన్ మొహమ్మద్(65) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సాక్షి, దిశ తదితర పత్రికలలో వివిధ హోదాల్లో దాదాపు 38 సంవత్సరాలకు పైగా పని చేసిన ఆయన… ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ‘ప్రతిపక్షం’ డిజిటల్ దినపత్రికను నిర్వహిస్తున్నారు.
ఫజల్ హఠాత్తుగా క్యాన్సర్ కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం అంత్యంత బాధాకరం అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే కి, ప్రత్యేక రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే సంఘాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని తెలిపింది. వారం రోజుల క్రితం నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఫజల్ కు మెరుగైన చికిత్స అందేలా ఎంతో కృషి చేసినప్పటికీ ఫలితం దక్కలేదని TUWJ పేర్కొంది. గత కొంతకాలంగా ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్న ఫజల్ రహ్మాన్ కుటుంబానికి టీయూడబ్ల్యూజే అండగా నిలిచి, ప్రభుత్వ పరంగా సహాయం అందేలా కృషి చేస్తుందని తెలిపింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బొడిగె బసవపున్నయ్య సైతం ఫజుల్ రహ్మాన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలం డైలీ యాజమాన్యం ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. కాగా, ఫజల్ రెహ్మాన్ స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్. వృత్తి రీత్యా ఆయన హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఆయనకి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


