కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం వాహన యజమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసిన ప్రైవేట్ బైక్‌లు, కార్లకు రిజిస్ట్రేషన్ (Vehicle Registration) కోసం RTO ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు. వాహనాన్ని షోరూమ్‌లోనే డెలివరీ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రజలకు సమయం ఆదా చేయడం, ఇబ్బందులు తగ్గించడం లక్ష్యంగా రవాణా శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మోటారు వాహనాల నియమాలకు అనుగుణంగా, అధికారిక ఆటోమొబైల్ డీలర్ల ద్వారా సేల్ అయ్యే వాహనాలకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
వాహనం కొన్న సమయంలోనే డీలర్ ఆన్లైన్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా సర్టిఫికేట్, చిరునామా రుజువు, వాహన ఫోటోలు వంటి అవసరమైన పత్రాలన్నీ డీలర్ ద్వారానే ఆన్లైన్లో అప్లోడ్ అవుతాయి. రవాణా శాఖ అధికారులు దరఖాస్తును పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమాని చిరునామాకు చేరుతుంది. ఈ మార్పుతో RTO కార్యాలయాలకు వెళ్లే ట్రాఫిక్, క్యూ ఇబ్బందులు తొలగడంతో పాటు సమయం ఆదా అవుతుంది.
అవసరమైన సందర్భాల్లో రవాణా శాఖ అధికారులు డీలర్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తారు. అయితే ఇది వాహన యజమానులకు ఎలాంటి ఆలస్యం లేదా ఇబ్బంది కలిగించదు. కాగా, ఈ సదుపాయం నాన్-ట్రాన్స్పోర్ట్ (ప్రైవేట్) బైక్‌లు, కార్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలు (టాక్సీలు, లారీలు మొదలైనవి) రిజిస్ట్రేషన్‌కు ఇప్పటి మాదిరిగానే RTOలో పరీక్ష తప్పనిసరిగా ఉంటుంది. డిజిటల్ తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన, ఆధునిక రవాణా సేవలను అందించడంలో మరో మైలురాయిగా నిలువనుంది.


