epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సౌండ్​ లైబ్రరీ : అంధుల కోసం తెలంగాణ‌లోనే మొద‌టిది

క‌లం, మెద‌క్ బ్యూరో : దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక శ్రవణ గ్రంథాలయం (Sound Library) ను సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. అంధులు కోసం ప్రత్యేకంగా సౌండ్ లైబ్రరీని ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రంలోనే ఇదే మొట్టమొదటిది. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకల సందర్భంగా దృష్టిలోపం గల వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్య, సమాచారం సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో శ్రవణ గ్రంథాలయం ని ప్రారంభించారు.

ఈ సౌండ్ లైబ్రరీ ద్వారా దృష్టిలోపం గల వారు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా చేసుకోవచ్చు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో కంప్యూటర్‌ను పూర్తి స్థాయిలో ఆపరేట్ చేయడం, చదవ‌టం ,ప్రాక్టీసు చేయ‌డం, డాక్యుమెంట్ల వినియోగం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. ఈ లైబ్రరీలో భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. దీని ద్వారా విజువల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు ముద్రిత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి చదువుకోవచ్చు. ఆఫ్‌లైన్‌తో పాటు గూగుల్ ఏఐ ఆధారిత ఆన్‌లైన్ విధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.

దృష్టిలోపం గల వారి వినియోగానికి అనుగుణంగా 10 ఏంజెల్ ప్లేయర్లు (డీజీ ప్లేయర్లు) ఏర్పాటు చేసారు. వీటి ద్వారా స్కాన్ చేసిన పుస్తకాలు, ఎడిటబుల్ ఫైళ్లు, పీడీఎఫ్ ఫార్మాట్లో ఉన్న పుస్తకాలను కాపీ చేసి వినియోగించుకోవచ్చు. కంప్యూటర్ అవసరం లేకుండానే తెలుగు, హిందీ తదితర భారతీయ భాషల పుస్తకాలను ఆడియో రూపంలో వినే సౌకర్యం ఉంది. భారతీయ యాసతో స్పష్టంగా చదివే విధానం ఈ లైబ్రరీ (Sound Library) ప్రత్యేక ఆకర్షణగా ఉన్న‌ది. అలాగే బ్రెయిలీ లిపి ప్రింటింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేసారు. అంతేకాకుండా ఇంగ్లీష్ లేదా తెలుగు భాషల్లో ఉన్న పుస్తకాలను (పీడీఎఫ్, జేపీజీ లేదా ముద్రిత రూపంలో) బ్రెయిలీ లిపిలోకి మార్చి ముద్రించడం ద్వారా దృష్టిలోపం గల వారు బ్రెయిలీ లిపి ద్వారా పుస్తకాలను చ‌దువుకోవ‌చ్చు.

ఈ సౌండ్ లైబ్రరీ దృష్టిలోపం గల విద్యార్థుల విద్యా పురోగతి, స్వావలంబనకు తోడ్పడటంతో పాటు ఆధునిక సాంకేతికతను వారికి మరింత దగ్గర చేస్తుంది. రాష్ట్రంలోనే మొద‌టిసారిగా ఎక్కడా లేని విధంగా దృష్టిలోపం గల వారి కోసం సంగారెడ్డి జిల్లాలో శ్రవణ గ్రంథాలయం ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అకాక్షించారు. మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో గురువారం అంధుల శ్రవణ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యలతో కలిసి ప్రారంభించారు.

Read Also: జనగామ చౌరస్తాలో కేటీఆర్ బొమ్మను ఉరితీసిన యూత్ కాంగ్రెస్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>