ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌

క‌లం, స్పోర్ట్స్: అభిమానులకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అదిరిపోయే వార్త చెప్పింది. 2027 ఐపీఎల్‌కు జట్టు పగ్గాలను మరోసారి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కే అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. పాండ్రా ట్రేడ్‌తో బ్లూక్యాప్స్‌ సారథి ఎవరవుతారా? అన్న చర్చలు జోరుగా సాగాయి. విశ్లేషకులు, సీనియర్ల చర్చల్లో అనేక మంది పేర్లు వచ్చినా.. అభిమానులు మాత్రం ఒక్కటే పేరు చెప్పారు. అదే రోహిత్ శర్మ. దాంతో అభిమానుల ఎంపికకే ముంబై ఇండియన్స్ ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు.

ముంబై ఇండియన్స్ చరిత్రలో రోహిత్ శర్మ (Rohit Sharma) పాత్ర చాలా స్పెషల్. 2013 నుంచి 2023 వరకు ఏకంగా 11 సీజన్ల పాటు జట్టును ముందుండి నడిపించాడు. ముంబైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు. అయితే, ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్న యాజమాన్యం, రోహిత్ స్థానంలో అతడిని కెప్టెన్‌గా నియమించింది. కానీ గత మూడు సీజన్లుగా జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో రాబోయే ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్లేయర్-స్వాప్ ట్రేడ్ డీల్‌లో భాగంగా హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు పంపిన ముంబై, అతడి స్థానంలో స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది. హార్దిక్ జట్టును వీడటంతో ముంబై కెప్టెన్సీ పదవి ఖాళీ అయింది. ఫ్రాంచైజీ తన చారిత్రాత్మక 20వ సీజన్‌లోకి అడుగుపెడుతున్న వేళ, జట్టుకు అత్యంత విజయవంతమైన నాయకుడినే మళ్లీ రంగంలోకి దించాలని యాజమాన్యం భావించింది.

2011లో ముంబై కుటుంబంలో చేరిన రోహిత్, తన నాయకత్వ లక్షణాలతో ఎందరో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాడని జట్టు ఓనర్ నీతా అంబానీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మూడేళ్ల విరామం తర్వాత రోహిత్ మళ్లీ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడంతో ముంబై ‘పల్టాన్’ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ మార్పుతో రాబోయే సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.

Also Read : సిరాజ్‌కు మళ్లీ మొండిచేయి.. అశ్విన్ సెటైర్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>