కలం, సోన్: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి నాగుపాము(Cobra) కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన కొత్తగొల్ల శ్రీకాంత్ ఇంటి ఆవరణలోకి రాత్రి 11.30 గంటల సమయంలో నాగుపాము ప్రవేశించింది. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు కుక్క గట్టిగా అరవడంతో అప్రమత్తమైన ఇంటి యజమాని బయటకు వచ్చి చూడగా పశువుల షెడ్డు వద్ద నాగుపాము కనిపించింది.
దీంతో వెంటనే నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన స్నేక్ క్యాచర్ అనిల్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న అనిల్ చాకచక్యంగా నాగుపామును పట్టుకుని సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పెంపుడు కుక్క అప్రమత్తం చేయడంతోనే ఇంట్లోకి నాగుపాము వచ్చిన విషయం గుర్తించగలిగామని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

