కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులతో రైతుల ఆదాయం ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుత రబీ సీజన్ సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోవడంతో రబీ సీజన్లో సాగు, దిగుబడి లేకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవనే టెన్షన్ వారిలో ఏర్పడింది. మరోవైపు రైతులు గతంలో తీసుకున్న వివిధ రకాల వ్యవసాయ రుణాల్లో (Telangana Crop Loans)‘అసలు’, వడ్డీ చెల్లించకపోవడంతో సుమారు రూ.7,304 కోట్ల మేర ‘నిరర్ధక ఆస్తులు’ (ఎన్పీఏ)గా మారాయని బ్యాంకులు ఈ ఏడాది తొలి 6 నెలల గణాంకాలను ప్రభుత్వానికి ఇటీవల నివేదించాయి.
సుమారు 6.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు ఎన్పీఏ జాబితాలోకి వెళ్లినట్లు తెలిపాయి. ఎల్ నినో రావడానికి ముందే రైతులకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిపోవడంతో ఖరీఫ్ కరువు, తాజాగా మొదలైన రబీ సీజన్ ప్రతికూల పరిస్థితులతో ఇప్పుడున్న మొండి బకాయిలకు తోడు రైతుల ఆర్థిక స్థోమత తగ్గి మరికొందరు రైతులు ఈ జాబితాలో చేరే అవకాశమున్నది.
పెరిగిన మొండి బకాయిలు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసిన అనంతరం పేరుకుపోయిన మొండి బకాయిలు వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఇంకెంత పెరుగుతాయోనని బ్యాంకు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల (జూన్ చివరి నాటికి) వ్యవసాయ రుణాల్లో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 4.27 శాతంగా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురవకపోవడంతో పంట పెట్టుబడికి తీసుకున్న అప్పులు, గత రుణాలపై అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో ఎన్పీఏ 4.59 శాతానికి పెరిగింది.
మొత్తం 6,37,303 మంది రైతుల ఖాతాలకు ఇచ్చిన పంట రుణాలు, షార్ట్ టర్మ్ క్రాప్ లోన్, అగ్రికల్చరల్ టర్మ్ లోన్, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్, అనుబంధ కార్యకలాపాల రుణాలు కలిపి సుమారు రూ.7,304 కోట్ల మేర ఉన్నట్లు బ్యాంకులు వెల్లడించాయి. రాష్ట్రంలోని మొత్తం 88.05 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ. 2 లక్షల కోట్ల రుణాలు క్లియర్ కావాల్సి ఉన్నాయని బ్యాంకులు పేర్కొన్నాయి.
బ్యాంకు రుణాలకు తిప్పలు తప్పవా?
బ్యాంకుల ఎన్పీఏ పెరిగిన కారణంగా ఇకపైన రైతులకు వ్యవసాయ రుణాల (Telangana Crop Loans) మంజూరులో ఎలాంటి కొత్త ఆంక్షలు వస్తాయోననే అనుమానం లేకపోలేదు. ఎల్ నినో కారణంగా రైతుల సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి తగ్గడంతో ఆశించిన మేర ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ప్రభుత్వం పంట నష్టానికి సాయం ఎంత ఇస్తుందో తెలియదు, రైతుభరోసా సాయం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వాయిదాల చెల్లింపు (‘అసలు’), వడ్డీ పేమెంట్ చేయలేక రైతులు ఆందోళనలోపడ్డారు.
ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో బ్యాంకులు సైతం వచ్చే వానాకాలం పంటకు అవసరమైన రుణాలను మంజూరు చేస్తాయో? లేవోననే సందేహాలూ రైతుల్ని వెంటాడుతున్నాయి. అనివార్యంగా మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవాల్సి వస్తుందేమోననే టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఎన్పీఏ జాబితాలోకి వెళ్లి రైతుల పట్ల బ్యాంకులు ఎలాంటి వైఖరి అవలంబిస్తాయన్నది కూడా కీలకంగా మారింది. ఎన్పీఏ ప్రభావం ఏయే రూపాల్లో రైతులకు ఎలాంటి చిక్కులు తీసుకొస్తాయనేది ఆసక్తికరం.
బ్యాంకులు పేర్కొన్న ఎన్పీఏ వివరాలు
స్వల్పకాలిక పంట రుణాలు: 4,87,062 ఖాతాలు (రూ.4,213.99 కోట్లు)
అగ్రికల్చరల్ టర్మ్ లోన్స్: 1,35,289 ఖాతాలు (రూ.1,759.53 కోట్లు)
అగ్రికల్చరల్ ఇన్ఫ్రా రుణాలు: 395 ఖాతాలు (రూ.88.93 కోట్లు)
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల లోన్లు: 14,557 ఖాతాలు (రూ.1,242.21 కోట్లు)
మొత్తం: 6,37,303 ఖాతాలు (రూ.7,304.66 కోట్లు)

