కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో మత్తు పదార్థాల నివారణ కోసం పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు అక్రమ మార్గాల ద్వారా రవాణా, వినియోగం కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో నషాముక్త్ భారత్ యాత్ర సాగుతున్న వేళ మరోసారి గంజాయి కేసులు కలకలం రేపాయి. ధూల్‌పేట్ (Dhoolpet)లో తాజాగా గంజాయి కేసుల్లో ఏడుగురిని ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం ధూల్‌పేట్‌లో గంజాయి కేసులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ భారీ ఎత్తున దాడులు చేపట్టింది. గతంలో నమోదైన గంజాయి కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఏడు ఎక్సైజ్ యూనిట్లకు చెందిన 30 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. గంజాయి దందా ఎక్కువగా జరిగే ధూల్‌పేట్‌తో పాటు మాంగు బస్తీ, బలరామ్ గల్లీ, గంగాబౌలి, మంగళ్ హాట్, లోయర్ ధూల్‌పేట్, జుమ్మెరాత్ బజార్ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితుల జాబితాలో శివ వాణి సింగ్, స్నేహ సింగ్, సుమన్ భాయ్, నయనా, దేవేందర్ సింగ్, దుర్గేష్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

