కలం, వెబ్‌డెస్క్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. తెలంగాణ పార్టీల విమర్శలు వాస్తవాలను మరుగున పరుస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో ఉన్న హాట్‌లైన్ దోస్తీ రాజకీయాల కోసమే మౌనంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు.
తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కొత్త ప్రాజెక్టు కాదని, దీనికి అదనపు నీటి కేటాయింపులు, కొత్త కాల్వలు, అదనపు రిజర్వాయర్లు లేవని జగన్ స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు పారుతుందని, 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీరు రాదని వివరించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల ద్వారా రోజుకు దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించడంతో పాటు, విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని దిగువకు వదిలేస్తోందని పేర్కొన్నారు.
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కరువు పీడిత రాయలసీమకు కేటాయించిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఒక ‘ఇన్సూరెన్స్ స్కీమ్’లా ఈ పథకాన్ని చేపట్టామని జగన్ తెలిపారు. అయితే, దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్టు పనులను తనకు ఎక్కడ పేరు వస్తుందోనన్న అక్కసుతో చంద్రబాబు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని బలిపెట్టి, రాయలసీమ ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు ఉరివేశారని జగన్ విమర్శించారు.

