తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్‌.. మంత్రి కీలక ప్రకటన

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలోనే తెలంగాణలో ‘గ్లోబల్ సమ్మిట్’ (Global Investment Summit) నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తెలంగాణను దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్’ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణం, అవకాశాలను వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికలతో పాటు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం

రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలంటే రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పెట్టుబడులు పెంచడంతో పాటు స్థానిక యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

గత పదేళ్ల పాలనలో కనీసం గ్రూప్-1 పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారని మంత్రి విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఇప్పటికే 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>