కలం, నిజామాబాద్ బ్యూరో: ఎల్ నినో పేరుతో పెంచుతున్న ధరలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాద్(Nizamabad) జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. ప్రజలను ఆర్థిక ఊబి నుంచి బయటకు తీసుకురావాల్సింది పోయి ధరల దోపిడీకి గురిచేస్తున్నాయని విమర్శించారు. సరుకుల ఎగుమతులు, దిగుమతుల విషయంలో సరైన ప్రణాళిక లేదని, నిత్యవసర వస్తువుల నిల్వలపై పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు.
బ్లాక్ మార్కెట్, నిల్వదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అధిక ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 28వ తేదీ 12 గంటలకు శివాజీ చౌక్, ఆర్.ఆర్. చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రెస్ మీట్ లో పార్టీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, నగర పార్టీ కార్యదర్శి నీలం సాయిబాబా, నగర నాయకులు ఏం. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

