కలం, వెబ్ డెస్క్ : నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. కేఆర్ఎంబీ (KRMB) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు సాగర్ కుడి కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఏపీ అధికారుల చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ఇంజనీర్లు, ఇందుకు పోటీగా ఎడమ కాలువ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలడంతో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే ఇప్పటికే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు (Palnadu Water Grid Project) నిర్మాణం, కృష్ణా డెల్టా అవసరాలపై ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ పోటాపోటీ నీటి విడుదల వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 534 అడుగుల వద్ద నిల్వ ఉంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 176 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇరు రాష్ట్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఇలా పోటాపోటీగా నీటిని విడుదల చేస్తూ పోతే, రాబోయే వేసవి నాటికి హైదరాబాద్ సహా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : హైకోర్టు సంచలన తీర్పు.. సీపీ, డీసీపీకి జైలు శిక్ష!
Follow Us On: Youtube

