కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్లో కొనసాగుతున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తుల నమోదు కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపడుతున్న పనుల పురోగతిని, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితర గుర్తింపు పత్రాల ఆధారంగా ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు.
లబ్ధిదారుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుల నమోదుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం నమోదు కేంద్రానికి వచ్చిన స్థానిక ప్రజలతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. దరఖాస్తుల సమర్పణలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, సిబ్బంది సహకారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ పథకం అమలును సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, కమిషనర్ జగదీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

