రాజ్యాంగ పరిరక్షణకు ఐక్య పోరాటం అవసరం: కూనంనేని సాంబశివరావు

​కలం, ఖమ్మం బ్యూరో: భారత రాజ్యాంగం, లౌకిక, సామ్యవాద విలువల పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) పిలుపునిచ్చారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి సభ నిర్వహించారు.

​ఈ సందర్భంగా కూనంనేని (Sambasiva Rao) మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అపార మేధస్సుతో, అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. 1949 నవంబర్ 26న ఆమోదించబడి, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రాణవాయువులాంటిదని పేర్కొన్నారు.

​నేడు కేంద్రంలోని పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, దాని మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ పీఠికలోని ‘సోషలిస్టు’, ‘లౌకిక’ పదాలను తొలగించి, దేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ పెట్టుబడిదారీ విధానాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వేల ఏళ్ల భారత చరిత్ర, సంస్కృతుల సారంతో రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని స్పష్టం చేశారు.

​ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసాన్ని సహించబోమని, లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం సీపీఐ దేశవ్యాప్త పోరాటాలకు పిలుపునిచ్చిందని కూనంనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, భూక్య దస్రు, ఎస్ కె ఫహీమ్, నేరెళ్ల రమేష్, కొమారి హన్మంతరావు, పాపారావు, వర్క అజిత్, గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాజ్యాంగంపై దాడికి కుట్రలు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>