కలం, వెబ్ డెస్క్ : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి (MLA Anirudh Reddy) సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో నిర్వహించిన ‘ఇందిరమ్మ జీవితబీమా పథకం’ అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆయనను స్థానిక మైనార్టీ ప్రజలు అడ్డుకుని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కావేరమ్మపేట దర్గా అభివృద్ధి కోసం సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తానని, అలాగే ఈద్గా స్థలం కేటాయిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. హామీల అమలులో జాప్యంపై స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలోనే మైనార్టీలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో అక్కడే ఉన్న ఎస్సై ఖాదర్ వెంటనే జోక్యం చేసుకుని ప్రశ్నించిన వారిని పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పారు. అయితే ఈ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. ఈద్గా స్థలానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే జిల్లా కలెక్టర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, కేబినెట్ ఆమోదం లభించగానే కేటాయింపు పూర్తి అవుతుందని వివరించారు.

