కలం, ఖమ్మం బ్యూరో: ఎట్టకేలకు అగ్రిగోల్డ్ కేసులో ప్రభుత్వ పరంగా కదలిక రావడం హర్షణీయమని, ఏపీ బాధితులతో సమానంగా తెలంగాణలోని ప్రతి ఒక్క బాధితుడికి పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా నిలిచి పోరాడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించడాన్ని స్వాగతిస్తూనే, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి బాధితులందరికీ తక్షణమే డబ్బులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాను గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాయడంతో పాటు పలుమార్లు సమస్య తీవ్రతను వివరించడం జరిగిందన్నారు. దీని ఫలితంగానే ప్రభుత్వం స్పందించి విచారణను సీఐడికి, సీఐడి ఎస్పీకి అప్పగించిందని, ప్రస్తుతం నమోదు ప్రక్రియ మొదలైందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించి, వాటి ద్వారా బాధితులకు రావాల్సిన సొమ్మును ఇప్పించాలని సీఎంను కోరినట్లు కూనంనేని వివరించారు.
బాధితులంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని, వారు తమ బాండ్లు, రసీదులను సులభంగా సమర్పించేందుకు బాధితులు ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో వెరిఫికేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఏలూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిన కేసుల పురోగతిని, తెలంగాణలో జప్తు చేసిన ఆస్తుల వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాధితుల కష్టాలకు త్వరగా తెరదించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు ఆ ప్రకటనలో తెలిపారు.

