కలం, స్పోర్ట్స్: టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ (Jannik Sinner)కు గాయం మరోసారి షాక్ ఇచ్చింది. కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతడి పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. గాయం తగ్గించేందుకు కొన్ని నెలలుగా చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సిన్నర్ చివరిసారిగా జులైలో వింబుల్డన్‌లో ఆడాడు. అక్కడ రెండోసారి టైటిల్ గెలిచి ఐదో గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి మోకాలి గాయంతో ఆటకు దూరంగా ఉంటున్నాడు. శస్త్రచికిత్స లేకుండానే కోలుకోవాలని తన బృందంతో కలిసి ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాలేదని తెలిపాడు. దీంతో ఇలియోటిబియల్ బ్యాండ్ సమస్యను సరిచేసేందుకు చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ ఆపరేషన్ ఫిన్లాండ్లో మోకాలి గాయాల నిపుణుడు లాస్సే లెంపైనెన్ నిర్వహించాడు.
మరో వైద్య నిపుణుడి అంచనా ప్రకారం సిన్నర్ కనీసం మూడు నుంచి నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉండొచ్చు. అదే జరిగితే మార్చిలో జరిగే ఇండియన్ వెల్స్, మియామీ టోర్నీల సమయంలోనే తిరిగి కోర్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన సిన్నర్.. జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే టోర్నీతోనే పునరాగమనం చేయాలని భావించాడు. కానీ తాజా శస్త్రచికిత్స ఆ ప్రణాళికకు అడ్డంకిగా మారింది.

