రాజ్యాంగ పరిరక్షణకు కదం తొక్కాలి: కుంభం అనిల్

కలం, భువనగిరి: ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘సంవిధాన్ రక్షక్’ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరి (Bhuvanagiri)లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నమ్మిండ్ల శ్రీనివాస్, ఆలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి మల్లయ్యలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి గొప్ప హక్కులను కల్పించిందని పేర్కొన్నారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించిన ఆయన, ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాద స్ఫూర్తిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, ఇది దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన కీలక బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు.

దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, హక్కులు కాపాడబడినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమంలో ప్రజలు, మేధావులు, యువత, ప్రజాస్వామ్యవాదులతో పాటు భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో హైదరాబాద్ ర్యాలీకి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పీఏసీఎస్ చైర్మన్లు పొట్టోళ్ళ శ్యామ్ గౌడ్, పక్కిర్ కొండల్ రెడ్డి, జీలుగు సతీష్ పవన్, ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణరెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>