కలం, జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధి, పద్మశాలి సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతపై బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి చేసిన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా స్పందించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు (Jagtial DCC Chief) గాజెంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దూమాల రాజ్‌కుమార్ తదితరులు మాట్లాడారు.
గాజెంగి నందయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ ప్రభుత్వంపై భోగ శ్రావణి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అవకాశం పొందిన ఆమె, ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి వర్గానికి ప్రాధాన్యత ఇస్తోందని, జగిత్యాల, ధర్మపురి మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులు కల్పించడంతో పాటు నేతన్నల సంక్షేమానికి చర్యలు చేపడుతోందన్నారు. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి గత ప్రభుత్వ బకాయిల చెల్లింపునకు రూ.350 కోట్లు విడుదల చేయడంతో పాటు వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి యూఐడీఎఫ్ నిధుల ద్వారా రూ.62.5 కోట్లతో సుందరీకరణ పనులు చేపడుతున్నామని, వార్డుల్లో డ్రైనేజీలు, మురికి కాలువల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ కాలేజీ, రోడ్ల అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాట్లాడుతూ.. భోగ శ్రావణి గత మున్సిపల్ పాలనలో జరిగిన పనులు, ఆరోపణలపై పూర్తి వివరాలను ప్రజావేదికపై ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చేనేత కార్మికుల పెన్షన్ల విషయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉందని, అనవసర రాద్ధాంతం చేయవద్దన్నారు. దూమాల రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రాజకీయ అవకాశాలు పొందిన అనంతరం బీజేపీలో చేరి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సరికాదన్నారు. జగిత్యాల అభివృద్ధికి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలను బీజేపీ నాయకులు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల అభివృద్ధిపై భోగ శ్రావణి ఎక్కడ, ఎప్పుడు చర్చకు పిలిచినా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని అభివృద్ధి పనులపై వాస్తవాలతో చర్చించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగభూషణం, బండ శంకర్, గట్టు సతీష్, పిప్పరి అనిత, సిరాజుద్దీన్ మన్సూర్, కౌన్సిలర్లు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

