అటవీ శాఖ అనుమతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : జిల్లాలోని ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా పీవీటీజీ కోర్ ప్రాంతాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని, రిజర్వ్ ఫారెస్ట్ (ఆర్‌ఎఫ్‌) పరిధిలో ఉన్న ఇళ్లకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.

అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద గిరిజన లబ్ధిదారులకు గృహ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా భూముల్లో లబ్ధిదారుల ఆధ్వర్యంలో చేపడుతున్న పాత చేదబావుల పూడికతీత, కొత్త చేదబావుల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న అటవీ శాఖ అనుమతుల సమస్యలపై అధికారులతో చర్చించారు.

గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, హౌసింగ్, విద్యుత్ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న క్లియరెన్స్‌లను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పెండింగ్ అనుమతులను త్వరితగతిన పొందాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో మంద మకరంద్, అటవీ శాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బొబాడే, హౌసింగ్ పీడీ శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>