రజకుల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన యాంత్రీకృత ధోబీఘాట్ (Mechanized Dhobi Ghat) సేవలను రజకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ ధోబీ కాలనీలో అంజని పుత్ర కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక యాంత్రీకృత ధోబీఘాట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, బహుజన వీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ కులవృత్తుల అభివృద్ధి, రజకుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆధునిక యంత్రాలను వినియోగించుకోవడం ద్వారా సంప్రదాయ వృత్తిని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాంత్రీకృత ధోబీఘాట్ వల్ల శారీరక శ్రమ తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందని, తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేసి మెరుగైన ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

సొసైటీ సభ్యులందరూ సమన్వయంతో, ఐకమత్యంగా ఉంటూ ధోబీఘాట్‌ను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఆధునిక సదుపాయాలను సద్వినియోగం చేసుకొని వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి. సోనియా, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>