కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పట్టణంలో నితిన్ నబిన్ నిర్వహించిన పాదయాత్రకు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం చూసి కాంగ్రెస్ నాయకులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) విమర్శించారు. కరీంనగర్ గోదాంగడ్డ రోడ్డులోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ సభలకు, పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ నాయకుల గుండెలు అదిరిపోతున్నాయని, తమ సభలతో పోల్చుకుని కలవరపడుతున్నారని సునీల్ రావు అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు అసూయతోనే కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పై నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
అభివృద్ధి, పార్టీ, హిందూత్వం తమకు సమానమని స్పష్టం చేసిన సునీల్ రావు (Yadagiri Sunil Rao).. గత ఏడేళ్లుగా బండి సంజయ్ నాయకత్వంలోనే నగరంలోని రోడ్లన్నీ నిర్మించబడ్డాయని తెలిపారు. కరీంనగర్-వరంగల్ రహదారి గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో చూడాలని, జగిత్యాల-కరీంనగర్ రహదారి పనులు కూడా జరుగుతున్నాయని వివరించారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు వేముల రమేష్, సోమిడి వేణు ప్రసాద్, బండ రమణా రెడ్డి, బండారి వేణు, కో-ఆప్షన్ సభ్యులు సర్దార్ బల్బిందర్ సింగ్, నాయకులు వేముల చంద్ర శేఖర్, గొట్టిముక్కుల రమణా రెడ్డి, పొన్నం మొండయ్య, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, దేవసాని సత్యనారాయణ, కటకం లోకేష్, అడిచెర్ల రాజు తదితర 25 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Also Read : పార్టీ ముసుగులో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం!
Follow Us On: X(Twitter)

