కలం, వెబ్ డెస్క్ : మత్తుపదార్థాల మహమ్మారి నుంచి యువతను కాపాడటమే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ‘నషా ముక్త్ భారత్’ (Nasha Mukt Bharat) పాదయాత్ర బుధవారం హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సినీ హీరోలు విక్టరీ వెంకటేశ్, నిఖిల్‌లతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారులతో కలిసి నేతలు, సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ” Say No to Drugs.. Yes to Life” అనే నినాదాలతో సాగుతున్న ఈ మూడు రోజుల పాదయాత్ర, అంబర్‌పేట నుంచి ముషీరాబాద్ మీదుగా జూబ్లీహిల్స్ వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ నెల 27న భారీ సంకల్ప సభతో యాత్ర ముగియనుంది.
ఈ కార్యక్రమం(Nasha Mukt Bharat)లో పాల్గొన్న హీరో వెంకటేశ్ యువతకు, తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు 2029 నాటికి దేశాన్ని పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. జీవితం ఎంతో విలువైనదని, తోటివారి ఒత్తిడికి లోనై యువత మత్తుపదార్థాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అలాగే, తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పటికప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవాలని, ఒకవేళ ఎవరైనా వ్యసనాలకు బానిసలైతే జాతీయ డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్ నంబర్ (14446) ద్వారా సహాయం పొందాలని సూచించారు.
మరోవైపు, దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలవాల్సిన యువత మత్తుపదార్థాల వల్ల నిర్వీర్యమవడం ఆందోళనకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికి డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంతో పాటు, 2,000 రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులందరూ ‘డ్రగ్స్-ఫ్రీ వారియర్స్’గా మారి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read : మహేశ్ ఒక్క కామెంట్.. చిన్నారి రీల్‌కు 26 మిలియన్ వ్యూస్!
Follow Us On: Youtube

