అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు.. ఎక్కడంటే?

​కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం (Enkoor Mandal) జన్నారం గ్రామానికి చెందిన గోంగూర కౌసల్య మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. రక్తసంబంధం కంటే ఆప్యాయత, మానవత్వం, బాధ్యత గొప్పవని ఆమె తన చేతలతో నిరూపించారు. కన్న తల్లిలా చూసుకున్న అత్త మరణించడంతో కుమారుడి స్థానంలో నిలిచి గోంగూర కౌసల్య స్వయంగా తలకొరివి పెట్టడం స్థానికంగా అందరినీ కదిలించింది. వివరాల్లోకి వెళ్తే.. జన్నారం గ్రామానికి చెందిన గోంగూర సావిత్రమ్మ (80) వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సావిత్రమ్మ భర్త నారాయణ చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందగా, వారి ఏకైక కుమారుడు వెంకటేశ్వర్లు 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భర్త మరణించిన నాటి నుంచి కోడలు కౌసల్య తన అత్తకు అండగా నిలిచారు. ఆమెకు అవసరమైన అన్ని సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.

​సావిత్రమ్మకు ఇద్దరు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. అయితే మనవడి భార్య గర్భవతిగా ఉండటంతో సంప్రదాయం ప్రకారం అతను తలకొరివి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి సంకోచం లేకుండా కౌసల్య ముందుకొచ్చి, కుమారుడి స్థానంలో నిలబడి మంగళవారం స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కన్నతల్లి కాకపోయినా తల్లిగా ఆదరించిన అత్తకు, కన్నకూతురిలా సేవలందించి అంత్యక్రియలు కూడా నిర్వహించిన కౌసల్యను గ్రామస్తులు, బంధువులు మనసారా అభినందించారు. బంధాలకు రక్తసంబంధమే ప్రామాణికం కాదని, ప్రేమాభిమానాలు, బాధ్యతలే అసలైన బంధమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పిందని పలువురు ప్రశంసించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>