కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) నేడు సమావేశం కానుంది. దేశవ్యాప్తంగా పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, విధానపరమైన సంస్కరణలతో పాటు రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, సభలో ప్రవేశపెట్టాల్సిన ముఖ్యమైన బిల్లులు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై కేబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎనర్జీ స్టోరేజ్, కీలక ఖనిజాల శుద్ధి, ఫాస్ట్-ట్రాక్ కోర్టుల విస్తరణ వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి భేటీలోనూ మరిన్ని ప్రజాకర్షక, ఆర్థిక సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా గత కొద్దిరోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుండటంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రులు మీడియా సమావేశం ద్వారా కేబినెట్ తీసుకున్న తుది నిర్ణయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

