మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: బండ ప్రకాష్​

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల ఐక్యతను చాటుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ సత్తా నిరూపించుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ (Banda Prakash) పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్ నగర్‌లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజులందరూ వ్యక్తిగత భేదాలను పక్కనపెట్టి సమాజ అభ్యున్నతి, హక్కుల సాధన లక్ష్యంగా సంఘటితంగా ముందుకు సాగాలని అన్నారు.

కరువు పరిస్థితులు, వర్షాభావం కారణంగా చెరువులు, కుంటల్లో నీటిమట్టాలు తగ్గిపోయి చేపల వేట ద్వారా జీవనం సాగించే మత్స్యకారులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేటనే నమ్ముకుని జీవించే మత్స్యకార కుటుంబాల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించాలని కోరారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

ముదిరాజుల సత్తా చాటుదాం

ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో తగిన గుర్తింపు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత సామాజిక చైతన్యంతో ముందుకు వచ్చి సంఘ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ముదిరాజులందరూ ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవడంతో పాటు సమాజ అభ్యున్నతికి బాటలు వేసుకోవచ్చని పేర్కొన్నారు.

బండ ప్రకాష్, అందె బాబయ్యలకు ఘన స్వాగతం

మహబూబ్‌నగర్ జిల్లా గండ్వీడ్ మండలంలో నిర్వహించనున్న పాలమూరు ప్రజా వీరుడు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ శాసనమండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, ప్రముఖ ముదిరాజ్ నాయకుడు అందె బాబయ్యలకు మహబూబ్‌నగర్ ఆర్‌ అండ్ ‌బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా ముదిరాజ్ నాయకులు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు పెద్ద విజయకుమార్ ముదిరాజ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సమాజ అభివృద్ధి, సంక్షేమం, హక్కుల సాధన, రాష్ట్రవ్యాప్తంగా సంఘటిత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు వరద యాదయ్య, ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకుడు బాల గోపి, పీయూజేఏసీ నాయకులు ప్రకాష్, గణేష్, సురేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజుల ఐక్యత, మత్స్యకారుల సంక్షేమం, సామాజిక హక్కుల సాధనే లక్ష్యంగా సమష్టిగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>