గిరిజన గ్రామాల అభివృద్ధికి కూనంనేని భరోసా

కలం, ఖమ్మం బ్యూరో : దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న మారుమూల గిరిజన గూడేలు, తండాలకు మహర్దశ పట్టనుంది. ఏజెన్సీ గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  లక్ష్మీదేవిపల్లి (Lakshmidevipally) మండల పరిధిలోని పలు గిరిజన పల్లెల్లో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రేగళ్ల, బంగారుచెలక ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

బావోజి తండా పంచాయతీ పరిధిలోని రేగళ్ల ఆర్ అండ్ బి రోడ్డు నుంచి కొత్తూరు వరకు రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే(MLA Kunamneni) ప్రారంభించారు. అలాగే రేగళ్ల పంచాయతీ పరిధిలో రేగళ్ల ఆర్ అండ్ బి రోడ్డు నుంచి బొల్లం అయోధ్య ఇంటి వరకు రూ.కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న మరో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని ఆర్లగండి నుంచి లక్ష్మీపురం గ్రామం వరకు రూ.కోటితో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.

అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజన, గిరిజనేతర పేద ప్రజల పట్ల తనకు ఎనలేని అభిమానం ఉందన్నారు. మారుమూల గ్రామీణ ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, చూపుతున్న ఆదరణే తన అసలైన బలమని పేర్కొన్నారు. ప్రజల ఆదరణతోనే ప్రజాసేవకు పూర్తిగా అంకితమయ్యానని తెలిపారు.

దశాబ్దాలుగా ఎర్రజెండాను, కమ్యూనిస్టు పార్టీని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న ఏజెన్సీ ప్రజల రుణాన్ని అభివృద్ధి పనుల ద్వారా తీర్చుకుంటామని చెప్పారు. గిరిజన పల్లెల ప్రగతికి పెద్దపీట వేస్తున్నామని, ప్రతి గూడెం, తండాకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి రవాణా కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, వివిధ శాఖల అధికారులు శంకర్, రఘురామయ్య, శివలాల్, ప్రవీణ్, నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, సరెడ్డి పుల్లారెడ్డి, దీటి లక్ష్మీపతి, దారా శ్రీనివాస్, పరుపర్తి రాజు, దేవరగట్ల రాంబాబు, కార్పొరేటర్లు గుర్రం వెంకటేశ్వర్లు, బోయిన విజయ్ కుమార్, సర్పంచులు బాడిశ మౌనిక, ఉమా మహేశ్వరి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>