పూజ చేస్తే డ‌బ్బు డ‌బుల్.. మార్కెట్‌లో కొత్త మోసం!

క‌లం, వెబ్‌డెస్క్‌: మార్కెట్‌లో రోజుకో కొత్త ర‌కం మోసం వెలుగులోకి వ‌స్తోంది. ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వ‌మే ఆస‌రాగా కొంద‌రు కేటుగాళ్లు దోపిడీల‌కు పాల్ప‌డుతున్నారు. ఇప్ప‌టికే సైబ‌ర్ మోసాలు, దొంగ బాబాలు, బెదిరింపులు, దొంగ‌త‌నాలు పెరిగిపోతుంటే ఇప్పుడు కొంద‌రు పూజ‌లు చేస్తే డ‌బ్బు డ‌బుల్ (Money Doubling Scam) అవుతుందంటూ కొత్త ర‌కం మోసాల‌కు తెర‌లేపారు. తాజాగా ఇలాంటి మోసానికి పాల్ప‌డుతున్న ఓ ముఠాను మంచిర్యాల (Mancherial) జిల్లాలోని ఉట్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములుకు అత్రం పరశురామ్ అనే వ్య‌క్తి మూడేళ్ల క్రితం ప‌రిచ‌య‌మ‌య్యాడు. రాములుతో చ‌నువు పెంచుకున్న ప‌ర‌శురామ్ అత‌డిని ఎలాగైనా మోసం చేసి డ‌బ్బులు దోచుకోవాల‌ని భావించాడు. త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బు తీసుకొస్తే పూజ‌లు చేసి డ‌బుల్ చేస్తాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. దీంతో రాములు త‌న ఇంట్లో నుంచి రూ.6.50 లక్షలు తీసుకొచ్చాడు. రాములు ప‌ర‌శురామ్‌ను త‌న పొలం వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. పొలంలో పూజలు చేసినట్టు నటించి రాముల‌కు ఓ బ్యాగ్ ఇచ్చి పది రోజుల తర్వాత తెరవమన్నాడు. అత‌ను చెప్పిన విధంగా ప‌ది రోజుల త‌ర్వాత బ్యాగ్‌ తెరిచి చూసిన రాములు షాక‌య్యాడు. అందులో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో న‌కిలీ నోట్లు, తెల్ల కాగితాలు కనిపించాయి. దీంతో రాములు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టి ఇలా పూజ‌ల పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టిస్తున్న ముఠాలోని న‌లుగురు స‌భ్యుల‌ను అరెస్ట్ చేశారు. మోసం చేయాల‌నుకున్న వాళ్ల‌తో ప‌రిచ‌యం పెంచుకొని, న‌మ్మ‌కం క‌లిగించి పూజ‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. డ‌బ్బు డ‌బుల్ చేస్తామ‌ని చెప్పి నోట్ల క‌ట్ట‌ల‌పై కింద‌, పైన అస‌లైన నోట్లు పెట్టి మ‌ధ్య‌లో మాత్రం నకిలీవి పెట్టి మోసం చేస్తున్నట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ ముఠాలో ప్రధాన నిందితులుగా ఉన్న‌ పరశురామ్, మండలి బక్కన్నల‌ను ఇచ్చోడ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ కేసులో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.40 లక్షలకు పైగా విలువైన 99 కట్టల నకిలీ నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బాధితులు 40 మంది వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మోస‌పోయిన వాళ్లు కూడా ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>