కలం, నిర్మల్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరల చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న సంయుక్త కిసాన్ మోర్చా (Samyukta Kisan Morcha) ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సహా మొత్తం 16 డిమాండ్ల సాధన కోసం ఈ నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంది రామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు భుక్య రమేష్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఆర్. రామలక్ష్మణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుంచుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

