కలం, వెబ్‌డెస్క్: ఏపీలో 15 ఏళ్ల తర్వాత నంది అవార్డుల (Nandi Awards) వేడుకకు ముహూర్తం కుదిరింది. రాష్ట్రంలో నంది అవార్డులు, జాతీయ సినీ అవార్డుల నిర్వహణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. ఈ అవార్డుల కార్యక్రమాలకు ఓవరాల్ ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ ఆధ్వర్యంలో అవార్డుల వేడుకను నిర్వహించనున్నారు.
ఈ అవార్డుల నిర్వహణకు అవసరమైన సేవలను పర్యాటక శాఖ ద్వారా వినియోగించుకునేలా సమన్వయం చేసుకోవాలని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సందర్భాల్లో పర్యాటక శాఖ సహకారంతో నంది అవార్డులు, జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఇతర అవార్డుల కార్యక్రమాలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని మేనేజింగ్ డైరెక్టర్‌కు స్పష్టం చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2011లో నంది అవార్డులు (Nandi Awards) ప్రదానం చేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగి ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత మళ్లీ ఈ వేడుక జరగలేదు. 2017లో అప్పటి ప్రభుత్వం 2012-16 సంవత్సరాలకు విజేతలను ప్రకటించినా ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించలేదు. ఇక 2017-2024 వరకు అసలు విజేతలను కూడా ప్రకటించలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఏపీలో నంది అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈ వేడుకలో 2017లో ప్రకటించిన విజేతలకు కూడా అవార్డులు అందించనున్నట్లు తెలుస్తోంది. రానున్న డిసెంబర్లో ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Also Read : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. ప్రభాస్ పిలుపు
Follow Us On: Youtube

