కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో దాడులు చేస్తామని ఉగ్రవాదులు ఒక ఈ-మెయిల్ పంపించారని పోలీసులు జారీ చేసిన మెస్సేజ్ బయటకు ఎలా లీక్ అయిందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన పోలీసుల సర్క్యులర్.. అన్ని సోషల్ మీడియాల్లో ఎలా వైరల్ అయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు పోలీస్ శాఖ అత్యంత గోప్యంగా ఉంచి.. విచారణ జరిపిస్తుంటుందన్నారు. ఈ సమాచారం బయటకు తెలిస్తే.. ప్రజలు అనవసర గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక.. హైదరాబాద్ సీపీ అది ఫేక్ ఈ-మెయిల్ అని ప్రకటించేశారన్నారు. హైదరాబాద్ నగరంలో కోటి మంది నివసిస్తున్నారని.. ఇంత అజాగ్రత్తగా మెస్సేజ్ ఎలా రిలీజ్ చేస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుకార్లు నమ్మొద్దని ఒక వైపు చెబుతూనే.. మరోవైపు లీక్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఇంతవరకు సీఎం రేవంత్ ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు.
మెటా ఆఫీసుపై దాడిని సమర్థిస్తారా..?
కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్లో మెటా ఆఫీసుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మూడు గంటల్లోనే వదిలిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని రేవంత్ రెడ్డి మెచ్చుకోవడం దారుణమన్నారు. కేటీఆర్ మీద అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టినందుకు ఒక న్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేస్తే.. 16 రోజులు జైల్లో పెట్టారన్నారు. ఒక పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తను భోజనం చేస్తుండగా లాక్కెళ్లిపోయారన్నారు.

