కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో కానుక అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను (Indiramma Sarees) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలకు ఈ చీరలను అందజేయనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 65 లక్షల మందికి, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం కోటి మంది మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఈ పంపిణీ కార్యక్రమానికి రేషన్ కార్డు ప్రధాన అర్హతగా నిర్ణయించారు. 18 ఏళ్లు నిండిన మహిళలు మాత్రమే చీరలు పొందేందుకు అర్హులు. లబ్ధిదారులు చీరలు తీసుకునే సమయంలో తమ ఆధార్ కార్డు వివరాలతో పాటు రేషన్ కార్డును చూపించాల్సి ఉంటుంది. మహిళలకు చీరలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

