కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జలాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao ) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నీటి వాటాపై తాము స్పష్టమైన లెక్కలు అడుగుతుంటే సీఎం సమాధానం చెప్పలేక ఫ్రస్టేషన్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలో ఉండి అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నిజాలు అయిపోవని, నీళ్లు ఎత్తిపోయమని తాము అడుగుతుంటే ఆయన తమపై దుమ్మెత్తిపోస్తున్నారని విమర్శించారు.
అంతేకాదు తెలంగాణలో వలసలకు, నీటి కష్టాలకు కాంగ్రెస్ పాలనే ప్రధాన కారణమని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు ఏనాడూ పూర్తిస్థాయిలో నీరు అందలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే ఎస్సార్ఎస్పీ వంటి ప్రాజెక్టుల్లో తుమ్మలు మొలిచిన కాలువలను బాగు చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామని హరీశ్ రావు గుర్తు చేశారు. రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని, పల్లేర్లు మొలిచిన పాలమూరు నేలలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పచ్చని మాగాణాలుగా తీర్చిదిద్దామని వివరించారు.
అయితే, మీరు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క లక్ష ఎకరాలకైనా అదనంగా నీళ్లిచ్చారా సీఎం రేవంత్? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా కట్టుబానిసల్లా మారారని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకునే క్రమంలో ముఖ్యమంత్రి తన సొంత జిల్లా మహబూబ్నగర్కే తీరని ద్రోహం చేశారని విమర్శించారు. 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలు తరలివెళ్తుంటే, ప్రాజెక్టులకు పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం నీళ్లు ఎందుకు రావడం లేదని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేవలం రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు.

