కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం.. దేవన్న ఆరోగ్యం నిలకడ‌

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (Prajavani Incident) సస్యరక్షణ మందు తాగిన బోరజ్‌ మండలం మందగడ గ్రామానికి చెందిన అశన్న కుమారుడు దేవన్న (52) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ప్రజావాణి ఆవరణలో దేవన్న సుమారు 30 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్‌, పాక్లోబుట్రాజోల్‌ మిశ్రమాన్ని తాగినట్లు పేర్కొన్నారు. వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించినట్లు తెలిపారు.

రిమ్స్‌ వైద్య పర్యవేక్షకుల నివేదిక ప్రకారం.. ఆసుపత్రిలో చేరిన సమయంలో దేవన్న స్పృహలోనే ఉన్నారని, వైద్యులు రెండుసార్లు గ్యాస్ట్రిక్‌ లావేజ్‌ (కడుపు శుభ్రం) చేసి, మెడికల్‌ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని వివరించారు. సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయన బీపీ (110/70), గుండె వేగం (94), ఆక్సిజన్‌ స్థాయులు (98 శాతం) సాధారణంగా ఉన్నాయని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

భూవివాదంపై విచారణ

సదరు భూవివాదంపై విచారణ జరిపినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. బోరజ్‌ మండలం హతిఘాట్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 16/A5లో ఉన్న 5 ఎకరాల భూమిని 1955లో రాంపూర్‌ గ్రామానికి చెందిన మాదిగ రాజలింగుకు అసైన్‌ చేసినట్లు తెలిపారు. భూభారతి రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరే పట్టాదారుగా ఉందని పేర్కొన్నారు.

సుమారు 40 ఏళ్ల క్రితం రాజలింగు మృతి చెందగా, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు నెలకొన్నాయని తెలిపారు. ఈ నెల 21న గిమ్మ-కె గ్రామానికి చెందిన రాచర్ల అశోక్‌ (తండ్రి దేవన్న) మరో ఏడుగురితో కలిసి తామే చట్టబద్ధమైన వారసులమని పేర్కొంటూ బోరజ్‌ తహసీల్దార్‌కు దరఖాస్తు సమర్పించారని వివరించారు. ప్రస్తుతం రికార్డుల పరిశీలన, విచారణ కొనసాగుతోందని, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>